Saturday, November 28, 2009

మొత్తం కాళ్ళెన్ని?

కం.
బల్లికి నాలుగు కాళ్ళున్
పిల్లికివలెనే, ఎనిమిది పిల్లుల కొకటే
తల్లి, మరి బల్లి తల్లికి
చెల్లికి కలిపెన్నికాళ్ళు చెప్పవె బాలా!

Friday, November 27, 2009

దత్తపది – బల్లి, పిల్లి, తల్లి, చెల్లి.

1.
కం. బల్లి తల మీద పడినను,
పిల్లియునుదయముననె కనిపించిన చెప్పెన్
తల్లియు దోషమనుచు, మరి
చెల్లియు కాదాయెదోషి చెప్పుము కృష్ణా!
భావము :- బల్లి తల మీద పడినచో దోషము, పిల్లిని ఉదయమున చూచిననూ దోషమని తల్లి పిల్లలకు చెప్పెను. మరి చెల్లి ఎదురైనా,పైబడినా దోషము కాదనుట ఎట్లు సమంజసమో చెప్పుము అని అతడు కృష్ణుని ప్రార్ధించెను.
2.
కం. బల్లిదుడా’రాజన్న’యు
పిల్లినిగనెనేమొ! పెల్లుబికిన తుఫానున్
తల్లికి, యాంద్రావనిలో
చెల్లికి, మనకందరికి సెలవును చెప్పెన్.
భావము :- ప్రతిపక్షాలను నిర్దాక్షిణ్యముగా అణగదొక్కి మహాబలవంతుడని పేరొందిన ఆ రాజశేఖరరెడ్డి ఎంత గొప్పవాడైనప్పటికీ ఉదయమున పిల్లి మొహము చూసినాడో ఏమో ! లేనిచో అంతటి ఘోర ప్రమాదము ఎలాజరిగేది. భీకర తుఫాను బారిన పడి , తెలుగు తల్లికి, ఆంధ్రదేశములోని తన అక్కలకూ చెల్లెళ్ళకూ,మనకందరికీ సెలవుచెప్పి వెళ్ళిపోవలసివచ్చింది
3.
కం. బల్లి.మహేంద్ర పొలములో
పిల్లిపెసర కాయలేరి, పిల్లలధికమౌ
తల్లి భరతమాతను, తన
చెల్లికని తయారు చేసె, చిరుకానుకగా!
భావము :- బల్లి.మహేంద్ర అను పేరుగల బాలుడు పొలములోని పిల్లిపెసర కాయలనుదెచ్చి , వాటితో అందమైన భరతమాత బొమ్మను తన చెల్లికి కానుకగా ఇచ్చుటకు తయారుచేశాడు.