Sunday, November 30, 2008

జ్జ

బుజ్జాయి బుజ్జి బొజ్జకు
అజ్జీర్ణ మొలదెని కజ్జికాయలు గుజ్జుల్
మజ్జిగగుడిపెనుబెజ్జమ
ముజ్జగముల బుజ్జియనుచు ముద్దుగ బుజ్జీ


బుజ్జికి గజ్జెలు గారెకు
బెజ్జము బొజ్జయు గణపతికెంతో అందం
మజ్జయు ఎముకకు కన్యకు
లజ్జయు ఒజ్జలు బడికిని కావలెబుజ్జీ

Saturday, November 29, 2008

చ్చ

మచ్చలయావది ! పచ్చని

పచ్చిక కుచ్చువిడమెచ్చి పలుపాలిచ్చున్

మచ్చలదది! పనికొచ్చా?

మ్రుచ్చుది, పిచ్చిదని తన్న  నొచ్చును చచ్చున్.

Friday, November 28, 2008

గ్గ

ధిగ్గున ముగ్గురు జగ్గులు

మగ్గులు పెగ్గులు కొనిరట భగ్గున మండన్

బిగ్గర గరచి మొగ్గిరి

సిగ్గులు ఎగ్గులు విడచిరి నెగ్గిరి తగవున్

Thursday, November 27, 2008

క్క

రెక్కలు ముక్కలు సలిపీ
లిక్కితొ చక్కగ బొరుసులు చెక్కి తినక్కా!
పిక్కలు, చెక్కిలి నొక్కులు
ముక్కును ముఖమునిటుచూడుమొక్కటి గొనుమా!

Wednesday, November 26, 2008

హ

ఇహ సాహసి సింహమును
స్నేహముతో సంహరించెదిహిహీయనగన్
గుహనూహించహమున్ చని
మహీశుడాహారమయ్యె కలహమునహహా.

Tuesday, November 25, 2008

స

గ్రాసము మాసముతో సరి
యసలె సరసు సలిలముడిగె వరుసగనెండున్
వసతి గల చోటనె బస
చేసెదము విలాసగతియది బకములారా! 

Monday, November 24, 2008

ష

ఆషా ఉషా హుషారుగ
భాషా షాపులో మిషనుల బహుషోకులనూ
భేషుగ జూసి తమాషా
వాషిన్గు మిషను కొనిరి శభాషన గొప్పెన్.

Sunday, November 23, 2008

శ

ఆశరవణు శబ్దము సే
య  శరము నిడ నతిశయముగ  జంపెను  శిశువున్
నాశోకవశమునకటా!
యశోవిశాలి దశరధుడు శాపము నొందెన్.

Saturday, November 22, 2008

వ

రావణుడనె కలవరపడి
నవనిలో వాలములె వాసి వానర మూకన్
కావలె వాల వికారుడు
నవమానవిధి, విను వీని వాలము కాల్చన్

Friday, November 21, 2008

ల

వాలిబలశాలిలేయవ
లీలగ రామశరమునకు నేలకు గూలెన్
యిలలో లంకకు రాజై
తలలు పదులైననేమి వాలెనుతూలెన్.

Thursday, November 20, 2008

ర

కంకర దారిరో, బారుకు 
వంకరటింకరరో , శంకరాపురమునకూ
జంకరె పాములు తిరుగ, భ
యంకర యేరోకటి బారు రానిక నటకున్

గారెలు బూరెలు జోరును
కరకరమను మొరమొరాలు ఖర్జూరాదుల్
చెరుకురసమరటి కొబ్బరి
నీరును గొనుమా తిరుమల వేంకట రమణా!

Wednesday, November 19, 2008

య

హాయిగ కాయలు తినవయ
దయామయ గణితమయోమయమయా,
దయసమయమె, యిస్తినయా
సాయము సేయవె వినాయకా మరువకుమా.

Tuesday, November 18, 2008

మ

జానకి మనమును మురిపిం
చిన రామునిమేకనవలెవినుమా మనవీ
మన మందరమూశ్రీరా
మనవమికి భద్రగిరి వెళదామా! మామా!

Monday, November 17, 2008

బ

బాబా పాముకు భయపడి
డాబా ఎక్కి బిగబట్టి బలముగనరిచెన్
బాబాయి వచ్చె గబగబ
దబదబ తల బగలకొట్టె  లబలబ చచ్చెన్ 

Sunday, November 16, 2008

ప

పాపకొక పూసల పలక
రూపాయి పొడుగు బలపము జులపాలొ ప్పన్
పాపిడి, మిఠాయి, మైసూ
రుపాకు పిల్లలకు తెచ్చెపూజిత బడికిన్.

Saturday, November 15, 2008

న

ధన మదమున కానక సతి
వినయవతియు, సుతులు గుణశీలురునైనన్
విన నెడ శూకరమనరే 
తనయుని జననీ జనకుల మాటను విననా.

Friday, November 14, 2008

ద

అందరు దూరం కారా
ఎందుకు రాలేదని నను నిందింతురదే
తొందరగొచ్చెదమిదిగో 
ముందుగ విందుకు వెళదమ సుందరవదనా

Thursday, November 13, 2008

త

ఉంటానెంతో తోడుగ
నంటే తానే తగూకు వస్తాడంతే
తుంటరి తమ్ముడు తంతే
వెంటనె తాతతో తిరుపతి వెళతా మాతా.

Wednesday, November 12, 2008

ణ

ఫణి, మణి, వాణీ, వీణా
బాణాసంచాకు వారణాసికి వెళ్ళెన్ 
విణుకుమిణుకులణకువగని
కాణీపాకగణపతి దుకాణమున కొనెన్.

Tuesday, November 11, 2008

డ

వడివడి నన్నము వండిరి
వడలావడలప్పడాలువడియాల్కిచడీ
వేడి పకోడిని, లడ్డును
ఘడియలో వడ్డించె పెళ్ళిసందడి విందున్.

Monday, November 10, 2008

ట

కోటికి నీటులు   యేటా
బాటా చెప్పులు కొనునట యవిలేవకటా
రేటైన నేటి  మేటా
సాటా బాటాకి చెప్పు టాటా చెపుతా.

Sunday, November 9, 2008

జ

రాజా రోజూ తినునొక
కాజా, పుట్టినదినమని తాగెను తాజా
మాజా పూజా,తేజా
రోజా తెచ్చె బహుమతిగ రోజాకూజా.

Saturday, November 8, 2008

చ

చిటచిట చినుకులు చిందగ
నీటుగ లేచిరి చకచక చేలకు చేరీ
చిటికెలొ చదరము చేసిరి
పాటును చూచిరి మొలకలు చల్లిరి పొలమున్.

Friday, November 7, 2008

గ

ఉంగరము పోయె గంగది
బంగారుదనీ వెదుకుతు గాబర పడగా
రంగకు దొరుకగ గబగబ
ఉంగరమివ్వగ బదులుగ బొంగరమిచ్చెన్.

చెంగావి చీర హంగులు
బంగారు చెంగులు జిలుగు రంగుల పొంగున్
ఉంగరములుంగిరగిరల్
లంగాలు నెవరికి వారె భజరంగభళీ.

Thursday, November 6, 2008

క

కొక్కొరుకోయనె కోడీ
టక్కున కాకాయనుచును కాకీ, గూట్లో
నిక్కీ కిచకిచ పిచ్చుక
నిక్కము కిలకిల పలుకుచు లేచెను చిలుకా.

కంకర దారిలో బారుకు
వంకర టింకరరొ శంకరాపురమునకూ
జంకరె పాములు తిరుగ,భ
యంకర యేరొకటిబారు రానికనటకున్

Wednesday, November 5, 2008

అం

అంబిక అందాల రాణి - అమ్మకు అన్నీ అందించును
అంగడి కెళ్ళి అన్నీ తెచ్చి - చెల్లికి అంకెలు నేర్పును
అంతేకాదు అందంగా - బొమ్మలు గీయును
అంత్యాక్షరిలో అంతాముందే - అందరి మన్నన అందుకుంది
అందుకే అంబిక అంటే అంజలి టీచరుకూ మాకూ ఎంతో ఇష్టం.

Tuesday, November 4, 2008

ఔ

ఔరంగాబాద్ లో ఔరంగజేబు
ఔట్ల పండుగనాడు ఔన్నత్యం కోసం
ఔదార్యంతో ఔషధాలు పంచాడు
ఔరౌర! ఔచిత్యమంటే ఇదేగా!
ఔనౌను! అందరు ఆయన ఔన్నత్యాన్ని పొగిడారు.

Monday, November 3, 2008

ఓ

వైజాగ్ ఓడరేవులో - ఓడలు చూడర !
ఓహోహో చూడర - ఉండవల్లి ఓ వింత !
ఓరోరి చూడర - ఓరుగల్లు అందము !
ఓనమాలు నేర్చుకోర - ఓటమి లేదు !
ఓర్పుగ చదివి ఎదగరా - ఓ మంచి మనిషిగ !

Sunday, November 2, 2008

ఒ

ఒప్పుల కుప్పా! - ఒయ్యారి భామ !
ఒంగోలు ఎద్దులు - ఒకటో నెంబర్ !
ఒక ఒర లో ఒప్పును - ఒకటే కత్తి !
ఒరిస్సాలో వినవలె - ఒరియాభాష !
ఎడారి ఒంటెకు - ఒయాసిస్సులే జీవం
ఒకడే ఒంటరిగుంటే - ఒప్పరు ఎక్కడ

Saturday, November 1, 2008

ఎ,ఏ,ఐ.

ఎర్రని ఎండలొ ఎగురకు ఎన్నడు
ఎత్తుగ ఉండెడి కొండను ఎక్కకు
ఎద్దుల బండికి ఎడమగ వెళ్ళూ
ఎవ్వరి తప్పును ఎదురుగ ఎన్నకు
ఎరుగని వారిని ఎక్కడ నమ్మకు
ఎన్నన్నా అమ్మను ఎన్నకు ఎప్పుడున్

ఎవరెస్టు శిఖరం ఎత్తూ ఎంత ?
తాజ్ మహల్ ఎక్కడ? ఎప్పుడు కట్టిరి?
చార్మినార్ కట్టినదీ ?ఎవరూ? ఎందుకు?
ఎనిమిదో ఎక్కము ఎట్లో ? చెప్పు?
దిక్కులు ,మూలలు , చుక్కలు ఎన్నో? చెప్పు?
ఎరుగుదు, ఎరుగుదు నన్నీ దిక్కులు , మూలలు
ఎనిమిది. చుక్కలు ఎన్నో? లెక్కకు ఎట్టా?

ఏడు కొండలు కు ఏడు ఏండ్లు
ఏరోజూ ఏడవకుండా బడికి రాడు
ఏపనీ చేయడు ఏమన్నా ఏమనుకోడు
ఏదో ఏదేదో చెప్తాడు ? ఏమిటిది?
ఏం చెయ్యాలనుకుంది టీచర్
ఏమనకుండా ఏలూరు తీసుకెళ్ళి
ఏనుగు బొమ్మను కొనిపెట్టిందంతే
ఏడాది పొడవునా ఏనాడూ బడి మానలేదు.

ఐజాక్ ది ఐలవరం - ఐదో తరగతి చదువును
ఐర! ఐరావతమెక్కి - ఐనవోలు వెళ్ళెను
ఐదు రూకలనిచ్చి - ఐసు క్రీము తినెను
ఐ!ఐ! అనుచూ - 'ఐతే' సినిమా చూచెను
ఐకమత్యమే బలమని - ఐశ్వర్యకు చెప్పెను.